జనాభా ప్రాతిపదికన ఫలాలు ..కుల గణన సర్వే 98 శాతం పూర్తి: సీఎం రేవంత్​రెడ్డి

  • రజాకార్లను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య 
  • ఆయన పేరు శాశ్వతంగా గుర్తుండేలా నిర్ణయం తీసుకుంటం
  • పార్లమెంట్​లోనూ కురుమల ప్రాతినిధ్యం పెంచుతామని హామీ
  • కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ -దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం పూర్తయిందని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో కులగణన చేపట్టామని చెప్పారు. చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే, దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌లోని కోకాపేటలో నిర్మించిన ‘కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనా’న్ని సీఎం రేవంత్​ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

భవిష్యత్​లో రాజకీయంగా, ఆర్థికంగా కురుమల కోటా కురుమలకు ఉండేలా చూసే బాధ్యత తనదని తెలిపారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డుకర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని చెప్పారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలన్నారు. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.  "కంచ ఐలయ్య చెప్పినట్లు తెలంగాణకు జమీందార్ల తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలి. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం.

మన అమ్మకు ప్రతిరూపం.. మన అక్కకు ప్రతిరూపం.. ఒకపక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి తెలంగాణ పంటతో పాటు బిడ్డలు చల్లంగా ఉండాలని,  బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం” అని ఆయన వివరించారు. తెలంగాణ పునర్‌‌‌‌నిర్మాణంలో కురుమలు భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ కోరిక అని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. సీఎంకు విప్ లే కళ్లు, చెవులని..  ప్రజాప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్ లుగా అవకాశం కల్పించినట్లు వివరించారు.  బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నారు కాబట్టే కురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 

కురుమలు కష్టాన్ని నమ్ముకున్నోళ్లు 

కురుమలు అత్యంత నమ్మకస్తులని, ఎంతో నిజాయితీపరులను, కష్టాన్ని నమ్ముకున్నోళ్లని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఊర్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని తాను చెప్తుంటానని, వారికి భూమి అమ్మితే డబ్బు నడుముకు కట్టుకుని తెచ్చిస్తారని అన్నారు. పార్లమెంటులో కూడ కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పారు.  కార్యక్రమంలో హర్యానా  గవర్నర్​ బండారు దత్తాత్రేయ , మంత్రి పొన్నం ప్రభాకర్​, విప్​ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ప్రకాశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, క్యామ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.